సింహగిరిలో మహిళా దినోత్సవ వేడుకలు

సింహాచలం(పెందుర్తి): మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌ పూసపాటి సంచయిత గజపతిరాజు పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. అడవివరానికి చెందిన పలువురు మహిళలు, సింహాచలం దేవస్థానంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న మహిళలు, భక్తులతో కలసి సంచయిత గజపతిరాజు వేడుకలు జరుపుకున్నారు. తొలుత కొండదిగువ మహిళా వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండ దిగువ తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బీపీ, సుగర్‌ తదితర పరీక్షలను చేయించుకున్నారు.