ముంబై : బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరాని ఇంట్లో కరోనా కలవరం రేపుతోంది. ఇప్పటికే ఆయన కుమార్తె షాజా మొరానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇంకో కుమార్తె, నటి జోవా మొరానికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జోవా 15 రోజుల కిందట రాజస్థాన్ నుంచి ఇంటికి తిరిగివచ్చినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు షాజా మొరాని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షాజా మార్చి తొలి వారంలో శ్రీలంక నుంచి ఇండియాకు తిరిగివచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే షాజాకు ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోయినా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. షాజా, జోవాలకు కరోనా సోకినట్టు తేలడంతో.. దీంతో కరీమ్ కుటుంబ సభ్యులతోపాటు.. వారి సహాయకులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్‌లో ఉంటున్నారు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ నటించిన రా.వన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఈయర్, దిల్‌వాలే చిత్రాలకు కరీమ్ నిర్మాతగా వ్యవహరించారు.